సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు 26వ వార్డ్ కౌన్సిలర్ అన్నం లావణ్య అనిల్

పయనించే సూర్యుడు, కోరుట్ల, ఏప్రిల్ 16 మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలు మరియు చిన్నారులు పోషకాలు ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకున్నప్పుడే భవిష్యత్తులో రోగాలకు దూరంగా ఉండవచ్చని కోరుట్ల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ 26వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అన్నం లావణ్య అనిల్ పేర్కొన్నారు. 'పోషణ పక్వాడ' కార్యక్రమంలో భాగంగా బుధవారం కోరుట్ల పట్టణంలోని 26వ వార్డు వినోబా రోడ్ అంగన్వాడి కేంద్రంలో పాలిచ్చే తల్లులకు, మహిళలకు శిశు పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహారం పట్ల క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నామని, కిశోర బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి తగు జాగ్రత్తలు సూచిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు మరియు కౌమార దశలోని బాలికలు ప్రభుత్వం అందించే పోషకాహార సప్లిమెంట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు వాణి, శారద లతో పాటు వార్డు మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.