పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన ఏకైక పార్టీ సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు సిపిఐ 101వ,ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని రహమంతా పూర్, డిండి లో తూం బుచ్చిరెడ్డి సిపిఐ జండాలని ఎగరవేశారు.మండలంలోని మిగతా గ్రామ శాఖల్లో మండల కార్యవర్గ సభ్యులు, శాఖ కార్యదర్శులు జండాలని ఎగరవేశారు. ఈ సందర్బంగా తూం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారత దేశం లో 100 పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ అని అన్నారు. భారత దేశంలో 1925 డిసెంబరు 26న, ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రంకావాలని పిలుపునిచ్చిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ అని బ్రిటిష్ వారి నుండి మన దేశానికి విముక్తి కొరకు విరోచితమైన పోరాటాలు సిపిఐ చేసిందని అన్నారు.బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై, ఆనాడు నిషేధానికి గురైన పార్టీ సిపిఐ అన్నారు. పార్టీ నేతల పైన కాన్పూర్, మీరుట్, పెషావర్ తదితర కుట్రకేసులు పెట్టి అనేకమంది నాయకులను జైల్లో నిర్బంధించారని అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పోరాటంలో అగ్రభాగాన నిలిచి అనేక త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ మాత్రమేనని అన్నారు. కార్మిక, విద్యార్ధి, రైతు, మహిళా, వ్యవసాయ కార్మిక, యువజన తదితర అనేక ప్రజా సంఘాలను నిర్మించి ఆయా వర్గాల సమస్యల పరిష్కారాల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించింది సిపిఐ అన్నారు. ఈ శతాబ్ద కాలంలో దేశ సమైక్యత కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎంతో మంది అమరవీరుల రక్తార్పరణతో ప్రజల కోసం పోరాటాలు నిర్వహించి ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు భాగాన నిలిచిన పార్టీ సిపిఐ మాత్రమే అని అన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నరహంతక నిజాంను గద్దె దించడానికి దొరల భూస్వాముల సంస్థానాదీశుల దౌర్జన్యాలు, దోపిడీ నుండి వెట్టిచాకిరి నుండి ప్రజలను విముక్తి చేయుటకై జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగాలతో మూడువేల గ్రామాలలో భూస్వాముల, దొరల ఆగడాల నుండి ప్రజలకు విముక్తి కల్పించి, భూమి లేని పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన మహత్తర చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 సంవత్సరాల చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకచారి, సహాయ కార్యదర్శి బొలె శైలేష్, కార్యవర్గ సభ్యులు నాయకులు నూనె వెంకటేశ్వర్లు, కేశవులు, సోమిడి శ్రీనయ్య, రహమంతా పూర్ సర్పంచ్ రాములమ్మ, నాయకులు సుందరమ్మ, వినయ్, గోవర్దన్, శ్రీనయ్య, లింగమయ, సైదులు, గంగయ్య, శ్రీను, లక్ష్మారెడ్డి, శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.