కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కొట్టేస్తున్న కంపెనీ

* వత్తాసు పలుకుతున్న వీఆర్వో, తాహసీల్దార్‌ * కోరమండల్ గ్రీన్ బెల్ట్ ఎంత

పయనించే సూర్యుడు డిసెంబర్ 27, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడరూరల్‌ మండలంలో రెవెన్యూ వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయంటూ స్వయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెట్టినా దిక్కులేదు. పైగా ఆక్రమణ దారులకు వత్తాసు పలుకుతూ పిర్యాదు చేసిన వారికి తప్పుడు నివేదికలివ్వడం పరిపాటిగా మారింది. ఇంతటితో ఆగకుండా కోరమండలన కార్పోరేట్‌ సంస్థకు వాకలపూడి గ్రామంలో సర్వేనెంబర్‌ 185లో ఉన్న సుమారు 50కోట్లు విలువ చేసే 10ఎకరాలు ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేసింది. అను నిత్యం ప్రజలకు కాలుష్యాన్ని పంచుతున్న కోరమండల్‌ సంస్థకు ప్రజలపై ఎప్పుడూ లేని ప్రేమ పుట్టుకొచ్చి పచ్చదనం..పేరుతో ఎకంగా 10ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ముందుకు వస్తే వారికి విఆర్వో వత్తాసు పలకడం, ఆయన మాటలకు తాహసీల్దారు కూడా తందాన తానా అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం వాకలపూడి గ్రామానికి చెందిన సర్వే నెంబర్‌ 185లో సుమారు 10ఎకరాల భూమిలో హరిత వనం పేరుతో కోరమండల్‌ సంస్థ మొక్కలు వేయడానికి ముందుకు వచ్చింది. అయితే దీనిని గ్రామ సభలో గ్రామస్తులు సైతం వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వ భూమిలో కోరమండల్‌ వారు ఎలా హరతి వనం పెంచుతారని తిరగబడ్డారు. అయతే స్థానిక విఆర్వో తమ్మారావు అది కోరమండల్‌ కంపెనీకి చెందినదని వాదించడం జరిగింది. అంతే కాకుండా రూరల్‌కు చెందిన కొంతమంది పాత్రికేయులు తాహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి అసలు విషయం తెలుసుకుందామని వస్తే ఆ భూమి కోరమండల్‌ కంపెనీకి చెందినదేనని చెప్పడం జరిగింది. అయితే స్థానికులు, స్థానిక రాజకీయ నాయకులు, గతంలో పదవులు చేసిన వారు, వాకలపూడి, వలసపాకల గ్రామాలకు చెందిన పెద్దలు దీనిని తీవ్రంగా ఖండిరచడంతో పాటు వ్యతిరేకించడం జరిగింది. దీనిపై రూరల్‌ ఎంపిడిఓను పాత్రికేయులు కలిసి వివరణ కోరగా ఆ భూమి ప్రభుత్వానిదేనని, రోడ్డుకు ఇరువైపులా చెట్లు వేసుకుంటామని చెప్పి అలా ఆక్రమించడం తప్పని దానిని వెంటనే ఆపుతామని హామి ఇవ్వడంతో ఈ విషయం ఇప్పటికి సద్దుమణిగింది. అయితే ఏది ప్రభుత్వ భూమో ఏది కార్పోరేట్‌ భూమో కూడా రెవెన్యూ అధికారులకు తెలియడంలేదా లేక తెలిసే చేస్తున్నారా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వాకలపూడి విఆర్వోగా పనిచేస్తున్న తమ్మారావు గతంలో వలసపాకల గ్రామంలో పనిచేసారు. అంతే కాకుండా స్థానిక శాసన సభ్యులు లేని సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు కనీసం స్థానిక కూటమి నాయకులకు కూడా తెలియకుండా అధికారులు ప్రవర్తించడం పై నాయకులు గుర్రు మంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే కోరమండల్‌కు ఎంత గ్రీన్‌ బెల్ట్‌ ఉందో అనే విషయంపై కూడా కొంతమంది ఆరా తీస్తున్నారు. ఆ కంపెనీకి ఉండే గ్రీన్‌ బెల్ట్‌లో కొన్ని కొత్త కంపెనీలను నిర్మించుకుందని, దీంతో గ్రీన్‌ బెల్ట్‌ అత్యవసరమన్న ఉద్దేశ్యంతో ఇలాంటి ఆక్రమణలు చేపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మొద్దు నిద్దుర వదలి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *