పయనించే సూర్యుడు డిసెంబర్ 28, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని పట్టణంలోని రెండో వార్డు బావాజీపేట ప్రజలు రేషన్ సరుకుల కోసం పడుతున్న ఇబ్బందులపై రెవెన్యూ అధికారులు శనివారం స్పందించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప వాల్మీకి నేతృత్వంలో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ రుద్ర గౌడ్ వార్డులో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు.తమ వార్డుకు చెందాల్సిన రేషన్ షాపును సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంత్ నగర్లో ఏర్పాటు చేయడంపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంత దూరం వెళ్లి సరుకులు తెచ్చుకోవడం తమకు భారంగా మారిందని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బావాజీపేటలోనే రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని వారు కోరారు. దీనిపై డిప్యూటీ తహశీల్దార్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించానని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.