ఏన్కూరు మండలం ఏజెన్సీల్లో ఆగని అక్రమ నిర్మాణాలు

* కనుమరుగవుతున్న 1/70 చట్టం * ఏన్కూరు మండల కేంద్రంలో అటకెక్కిన 1/70 చట్టం * అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు * గిరిజన చట్టాలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం * అనుమతులు లేకున్నా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న పట్టించుకోని అధికారులు * బడాబాబుల చేతిలో బందీ అవుతున్న ఏజెన్సీ చట్టాలు * దీని వెనక ప్రజాప్రతినిధుల మద్దతు ఉందా

పయనించే సూర్యుడు డిసెంబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అధికారుల అండదండలు ఉంటే ఏదైనా చెయ్యొచ్చా ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి గిరిజనేతరుల బహుళ అంతస్తుల నిర్మాణం అడ్డూ అదుపు లేకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 1/70చట్టాన్ని అటకెక్కించి అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు నోరుమెదపని కథనమిది మండల పరిధిలోని బడాబాబులకు మూడు,నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేదు. పంచాయతీ అధికారుల అనుమతి అసలే లేకపోవడం గమనార్హం. పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలను బడాబాబులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అధికారులకు భారీగా ముడుపులు చేరడం వల్లనే పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు వారికి కొమ్ముకాస్తున్న కారణంతో ఎటువంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు. అక్రమాలను, దందాలను అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా ముడుపులకు అలవాటు పడితే వాటికి అడ్డుకట్టు వేసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు గిరిజన ప్రజలు. ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏన్కూరు మండలం పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న, నిర్మాణాల ప్రణాళిక విభాగం అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం గా ఏర్పాటు చేస్తున్న నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం కట్టాలంటే గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి భూమిపై ఉన్న హక్కు పత్రాలను చూపించాలి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి ఉంటేనే భవన నిర్మాణం చేపట్టాలి. కానీ అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు. ఈ భవనాల నిర్మాణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూర్ మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70, 1/59 వంటి చట్టాలకు విరుద్ధంగా, గిరిజనేతరులు భూములను అక్రమంగా కొనుగోలు చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ అక్రమ కట్టడాలను అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, చట్ట ఉల్లంఘన: గిరిజన ప్రాంతాల్లో భూమి హక్కులు కేవలం గిరిజనులకు మాత్రమే ఉంటాయి. గిరిజనేతరులు భూములు కొనడం లేదా నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. అక్రమ నిర్మాణాలు: అనుమతులు లేకుండా లేదా అనుమతులు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు: ఏన్కూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగుతున్నాయి. నిర్లక్ష్యం: అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ కట్టడాల వల్ల స్థానిక పర్యావరణం, సామాజిక వనరులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్రమ నిర్మాణాలపై మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందు ముందు ఇలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *