ప్రాణాలకు ముప్పుగా మారిన కోనోకార్పస్ చెట్లు తొలగించాలి

* అర్బన్ బయోడైవర్సిటీ అధికారులను కోరిన నెమలి అనిల్ కుమార్

పయనించే సూర్యడు / డిసెంబర్ 31/ కాప్రా ప్రతినిధి సింగం రాజు మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రాణాలకు అపాయంగా మారిన కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ) అధికారులను కోరారు. శక్తి సాయి నగర్ కాలనీ పార్క్‌లో ఉన్న కోనోకార్పస్ చెట్ల కారణంగా కాలనీవాసులు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని శక్తి సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జెస్సి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు కాలనీవాసులు చేసిన ఫిర్యాదుల మేరకు యూబీడీ అధికారులను సంప్రదించగా, గురువారం పార్క్‌లోని కోనోకార్పస్ చెట్లను తొలగించారు. ఈ చెట్ల వల్ల పలువురికి శ్వాస సంబంధిత వ్యాధులు, అలర్జీలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కోనోకార్పస్ చెట్లు పర్యావరణానికి తీవ్రంగా హానికరమని అన్నారు. ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వాయువును అధికంగా విడుదల చేయడంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని, అంతేకాకుండా డ్రైనేజీ లైన్లు, మంచినీటి పైపులు, విద్యుత్ కేబుళ్లకు భారీ నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి చెట్లను నివాస ప్రాంతాల్లో కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కోనోకార్పస్ చెట్లను పెద్ద ఎత్తున నాటడం దురదృష్టకరమని నెమలి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఈ చెట్లను తొలగించి, స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె. రాజేష్, రాకేష్, యాసీన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *