ఆడబిడ్డ పుడితే కొదురుపాకలో పండుగే సర్పంచ్ భరోసాతో బంగారు భవిష్యత్తు!

* పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ. 5000 ఫిక్స్డ్ డిపాజిట్: సర్పంచ్ మంజుల సుధాకర్ గొప్ప నిర్ణయం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 03 బోయినపల్లి (మధులత రాగేటి ) సమాజంలో ఎంత మార్పు వచ్చినా నేటికీ కొన్నిచోట్ల ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రుల కళ్లలో ఆందోళన రేకెత్తుతోంది. భవిష్యత్తులో ఆమె చదువు, పెళ్లిళ్లు భారమవుతాయేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. సరిగ్గా ఇక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలికారు. ఆడపిల్ల పుడితే అది అదృష్టమని, ఆ బిడ్డ ఇంటికి మహాలక్ష్మి అని చాటిచెప్పడమే కాకుండా, ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యతను కూడా తామే భుజానికెత్తుకున్నారు. నూతన సర్పంచులు కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, సామాజిక మార్పు కోసం పని చేయాలన్న గొప్ప సంకల్పంతో “కొదురుపాక సర్పంచ్ భరోసా” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సర వేళ గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు చేరవేయాలనే లక్ష్యంతో సర్పంచ్ మంజుల సుధాకర్ తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా అండగా ఉంటానని ప్రకటించారు. ఈ బృహత్తర కార్యాన్ని ప్రారంభించేందుకు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన తిరుమలేష్, గౌతమి దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించగా, ఆ చిన్నారిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి సర్పంచ్ దంపతులు ఆ దంపతులకు భరోసా కల్పించారు. చిన్నారి పేరు మీద కొత్తగా అకౌంట్ తెరిపించి, తమ సొంత నిధుల నుంచి 5000 రూపాయలను డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్కును తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఆడపిల్ల చదువు, పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకూడదని, ఈ చిన్న పొదుపు ఆమె ఎదిగేసరికి ఒక పెద్ద ఆర్థిక అండగా మారుతుందని వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఇలాంటి చేయూతనివ్వడం వల్ల ఆడపిల్లల పట్ల గ్రామంలో ఉన్న ఆలోచనా దృక్పథం మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, స్వయంగా ఆర్థిక సాయం చేస్తూ అకౌంట్ పుస్తకాన్ని చేతిలో పెట్టడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంజుల సుధాకర్ దంపతుల ఈ మానవీయ కోణాన్ని, వారి సామాజిక బాధ్యతను కొదురుపాక ప్రజలు కొనియాడుతున్నారు. జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న ఈ సర్పంచ్ దంపతుల ఆలోచనా విధానం ఇప్పుడు ఇతర గ్రామాలకు కూడా దిక్సూచిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *