పయనించే సూర్యడు / జనవరి 03/కాప్రా ప్రతినిధి సింగం రాజు : తెలంగాణ గడ్డపై సబ్బండ వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) పనిచేస్తోందని పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన ఆదేశాల మేరకు టీఆర్‌పీ యువజన విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలకు యూత్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలను నియమించినట్లు పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ క్రమంలో టీఆర్‌పీ యువజన విభాగం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా సింగం ఆరుణ్ కుమార్ పటేల్‌ను నియమించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తును మార్చే శక్తి యువతేనని చెప్పారు. పదవి అనేది అధికారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, సబ్బండ వర్గాల రాజ్యాధికార లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను యువత నిర్వర్తించాలని పేర్కొన్నారు. అనంతరం సింగం ఆరుణ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ జిల్లా యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు తీన్మార్ మల్లన్నకు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి గౌడ్‌కు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేస్తూ పేదలు, నిరుద్యోగులు, అణగారిన వర్గాల సమస్యలపై ఉద్యమాత్మకంగా పోరాడతామని చెప్పారు. మల్లన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ గడప గడపకు పార్టీ సందేశాన్ని తీసుకెళ్లి, తెలంగాణలో ప్రజారాజ్య స్థాపన కోసం యువతను ముందుండి నడిపిస్తామని తెలిపారు.