పయనించే సూర్యుడు జనవరి 5 కరీంనగర్ న్యూస్: వికలాంగుల కాలనీలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందులకు అక్షర ప్రదాత, అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపి ద్వారా వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి, అనేక మంది అందుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని కొనియాడారు. లూయిస్ బ్రెయిలీ జీవితం మనకు ఇచ్చిన సందేశం వికలాంగత అడ్డంకి కాదు–నిర్లక్ష్యమే అడ్డంకి అని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యోగ సంఘాలు ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తాయని స్పష్టం చేశారు. అంద ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లలో మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే పదోన్నతులు, డిపార్ట్మెంటల్ టెస్టుల్లో మినహాయింపులు కల్పించే దిశగా నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్జీవో సంఘం అంద ఉద్యోగులకు రెండు కనుల్లా నిలిచి, ఏ అవసరం వచ్చినా తోడు నీడగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సమాఖ్య సలహాదారు శ్రీ కె. నర్సయ్య మార్గదర్శకత్వంలో, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ అర్విందర్ సింగ్, సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నేషనల్ బ్లైండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొని లూయిస్ బ్రెయిలీ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు