పయనించే సూర్యుడు/ జనవరి 6/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదాన ఆవరణలో హుజురాబాద్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల స్కూల్ బస్సులను అధికారులు పరిశీలించారు. బస్సుల కండిషన్‌తో పాటు వాహన పత్రాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి వేణు మాట్లాడుతూ, మోటార్ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, పన్ను రసీదు, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్ ఫొటోను బస్సులో ఏర్పాటు చేయాలని, కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి, 60 ఏళ్లలోపు వయస్సు ఉండాలని తెలిపారు. కంటి పరీక్షలు, మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి స్కూల్ బస్సులో అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, సైడ్ అద్దాలు ఉండాలని, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదన్నారు. బ్యాటరీ, వైపర్స్, ఇండికేటర్లు సక్రమంగా పనిచేయాలని, స్కూల్ బస్సులకు పసుపు రంగు తప్పనిసరి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. మలుపులు, నిలుపు వద్ద చేతి సంకేతాలు ఇవ్వాలని, కదులుతున్న వాహనాన్ని ఎక్కడం లేదా దిగడం చేయరాదన్నారు. పాదచారులు జీబ్రా లైన్ వద్దనే రోడ్డు దాటాలని, వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని తెలిపారు. రాత్రి వేళ వాహనం నిలిపినప్పుడు పార్కింగ్ లైట్ తప్పనిసరిగా వేయాలని సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సులు సరైన కండిషన్‌లో ఉన్నప్పుడే ప్రయాణానికి వినియోగించాలని, నైపుణ్యం గల డ్రైవర్లనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాలకు అధికారులు సూచించారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తస్మా అధ్యక్షులు వెంకటేశ్వర్, జిల్లా తస్మా నాయకులు కోరం సంజీవరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్స్ రవీందర్, కిరణ్, కోటి, రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్‌తో పాటు బస్సు డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.