పయనించే సూర్యుడు జనవరి 06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: అప్పుల ఊబిలో ఉన్న ఆ రైతు ఈసారైనా పంట పండి గట్టెక్కుతాననే ఆశతో కట్టుకున్న భార్య పుస్తెలతాడు అమ్మేశాడు. కాయకష్టం చేసి కన్నబిడ్డలా సాగు చేసిన పంట చేతికందే సమయంలో కంపెనీల నిర్లక్ష్యానికి బలైపోయింది. ఫలితంగా సుమారు 5 లక్షల పెట్టుబడి బూడిదై, ఆ రైతు కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం, రేపల్లెవాడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రేపల్లెవాడ గ్రామానికి చెందిన రైతు భూక్య దస్రు గతంలో మిర్చి, పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. ఆ అప్పుల నుండి బయటపడేందుకు, ఇంట్లో ఉన్న బంగారు నగలు, పుస్తెలతాడు అమ్మి, మరికొంత బయట అధిక వడ్డీలకు అప్పు తెచ్చి మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వర్లు ద్వారా సింజెంట కంపెనీకి చెందిన ‘602’ రకం విత్తనాలు కొనుగోలు చేసి నాటారు. మందు కొడితే మాడిపోయింది పంట వేసిన 40 రోజుల తర్వాత, గడ్డి నివారణ కోసం కంపెనీ సూచించిన టింజర్ మరియు అట్రాజన్ మందులను పిచికారీ చేశారు. ఏపుగా పెరగాల్సిన పంట, మందు కొట్టిన 5-6 రోజుల్లోనే వింతగా ఎండిపోయి నిర్జీవంగా మారింది. దీంతో అవాక్కైన రైతు డీలర్లను, కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా.. వారు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. విత్తనాల నాణ్యతపై నిలదీస్తే బాండు పేపర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని వేడుకోలు: కళ్లముందే 5 లక్షల పెట్టుబడి మట్టిపాలైంది. ఇప్పుడు నేను, నా కుటుంబం ఆత్మహత్యే శరణ్యం అనే స్థితిలో ఉన్నామని దస్రు కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, పంట నష్టానికి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు. పంట ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతు భూక్య దస్రును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నకిలీ విత్తనాలు లేదా రసాయన లోపాల వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో శాస్త్రీయ విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
