పయనించే సూర్యుడు జనవరి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి: మండలం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, సరెండర్ బిల్లులు తదితర అన్ని ఆర్థిక బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. యం. శ్రీధర్ శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బిజినపల్లి మండల కేంద్రంలో టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు వి. రాములు అధ్యక్షతన నిర్వహించిన టిఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలుకావడం లేదని ఆయన విమర్శించారు. విడతల వారీగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా ఏడాది కాలంగా అనేక మంది ఉపాధ్యాయుల బిల్లులు మంజూరు కాలేదని తెలిపారు. ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను పెంచి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే బకాయి పడిన ఐదు డీఏలను మంజూరు చేసి, 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా మెరుగైన వేతన సవరణ చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి. ప్రభాకర్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్న నూతన జాతీయ విద్యా విధానం–2020ను రద్దు చేసి ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ బిజినపల్లి మండల కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా వి. రాములు, ప్రధాన కార్యదర్శిగా డి. ప్రభాకర్, ఉపాధ్యక్షురాలిగా పి. నజీమా పర్వీన్, కోశాధికారిగా కె. శ్రీనివాస్, అకడమిక్ కన్వీనర్‌గా యాకూబ్ అలీతో పాటు మండల కార్యదర్శులు ఎన్నికయ్యారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి పి. రఘునందన్ శర్మ చేతుల మీదుగా 2026 టిఎస్ యుటిఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.