పయనించే సూర్యుడు/ జనవరి 7/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; కొండపాక గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన తొలి హామీని గెలిచిన వెంటనే అమలు చేసి, సర్పంచ్ దాట్ల వీరస్వామి తన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా “గ్రామానికి మానేరు నీరు తీసుకొస్తాం” అనే హామీని ప్రజలకు ఇచ్చిన ఆయన, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను కార్యరూపం దాల్చేలా చర్యలు ప్రారంభించారు. కొండపాక గ్రామం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. మానేరు నది నుంచి గ్రామానికి నీటిని తీసుకొచ్చేందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రామంలోని ప్రతి కుటుంబానికి శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశముందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, గెలిచిన వెంటనే అమలు చేయడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ వీరస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత త్వరగా హామీ అమలు చేస్తారని ఊహించలేదు. ఇది గ్రామ అభివృద్ధికి మంచి ఆరంభం అంటూ పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాట్ల వీరస్వామి మాట్లాడుతూ – ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తాం. కొండపాక గ్రామ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాం అని స్పష్టం చేశారు. మానేరు నీటి ప్రాజెక్టుతో పాటు, రానున్న రోజుల్లో గ్రామంలో రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సర్పంచ్ తెలిపారు. ప్రజల సహకారంతో కొండపాకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
