
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 పలాస నియోజకవర్గ ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గంలో కొండలను తవ్వుతూ, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న అక్రమ గ్రావెల్ మాఫియాపై పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జరిగింది ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క. అక్రమంగా ఎవరు తవ్వకాలు జరిపినా, వారి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు,” అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖల అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు.అధికారులకు పూర్తి స్వేచ్ఛ-నా పేరు చెప్పినా వదలొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ, “నేను చేయని తప్పుకు నిందలు మోయడానికి సిద్ధంగా లేను. ఈ రోజు నుంచి ఏ అధికారిపైనా రాజకీయ ఒత్తిడి ఉండదు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను తక్షణమే సీజ్ చేయండి, ఫైన్లు వేయండి, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయండి. మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా నని అధికారులతో అన్నారు. ఈ విషయంలో ఎవరు తలదూర్చినా, చివరికి తన పేరు చెప్పినా ఉపేక్షించవద్దు,” అని అధికారులకు భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వీఆర్వోలకు తెలియకుండా ఉండదని, ఇకపై ఎక్కడ అక్రమం జరిగినా సంబంధిత అధికారిదే బాధ్యత అని, వారిని కలెక్టర్కు సరెండర్ చేస్తానని స్పష్టం చేశారు. పలాసలో చట్టబద్ధమైన గ్రావెల్ క్వారీలు లేవు: మైనింగ్ ఏడీ విజయలక్ష్మి సమావేశంలో పాల్గొన్న మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) బి. విజయలక్ష్మి నియోజకవర్గంలోని పరిస్థితిని వివరించారు. “పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కలిపి మొత్తం 21 లీజులు ఉండగా, వాటిలో అత్యధికం పర్యావరణ అనుమతులు, రెవెన్యూ బకాయిలు వంటి కారణాలతో పనిచేయడం లేదు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో అధికారికంగా పనిచేస్తున్న గ్రావెల్ క్వారీ ఒక్కటి కూడా లేదు,” అని ఆమె తెలిపారు. అభివృద్ధి పనులకు, ప్రభుత్వ అవసరాలకు గ్రావెల్ అవసరమైతే, సంబంధిత శాఖలు ఉచిత పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వాణిజ్య అవసరాలకు లేదా ప్రైవేట్ వ్యక్తులు క్వారీల కోసం మైనింగ్ శాఖ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక పరిష్కారంగా, ఏపీఎండీసీ ద్వారా వజ్రపుకొత్తూరు మండలంలో రెండు పెద్ద క్వారీలను ప్రతిపాదించామని, అవి అందుబాటులోకి వస్తే సమస్య చాలా వరకు తీరుతుందని ఆమె వివరించారు.