హుజురాబాద్ డంపింగ్ యార్డ్ : రాజకీయ అంశం కాదు – ప్రజల జీవన పోరాటం

* ప్రజల ఆరోగ్యంపై ముప్పు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉగ్ర నిరసన

పయనించే సూర్యుడు/ జనవరి 8/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; హుజురాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు రాజకీయ వేదికలను దాటి నేరుగా ప్రజల జీవన సమస్యగా మారింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి దశలో జారీ చేసిన డంపింగ్ యార్డ్‌కు సంబంధించిన జీవోను రద్దు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనాధారం, పర్యావరణం తీవ్ర ప్రమాదంలో పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని తొలిసారిగా బలంగా ప్రజల ముందుకు తీసుకువచ్చిన ప్రముఖ సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకుడు సబ్బని వెంకట్. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ఆయన మొదలుపెట్టిన పోరాటం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. గ్రామస్తులు, రైతులు, మేధావులు పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందజేస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరిగితే పసిపిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల ముప్పు పెరుగుతుందని సబ్బని వెంకట్ ఇప్పటికే పలు మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నారు. డంపింగ్ యార్డ్ కారణంగా పంట పొలాలు కాలుష్యానికి గురవుతాయని, భూగర్భ జలాలు విషతుల్యమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతమని, ఒకసారి కాలుష్యం చోటు చేసుకుంటే తరతరాలుగా సాగు భూములు నాశనం అవుతాయని రైతులు స్పష్టం చేస్తున్నారు. త్రాగునీటి వనరులు కలుషితమైతే ప్రజల జీవితం దుర్భరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హుజురాబాద్ పర్యటన సందర్భంగా సిరసపల్లిలోని సబ్బని వెంకట్ నివాసానికి చేరుకున్నారు. విలేకరులు, గ్రామస్తుల సమక్షంలో డంపింగ్ యార్డ్ వల్ల తలెత్తే భయానక పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం జరిగే ప్రతి ఉద్యమానికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని, అవసరమైతే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఆయన ప్రకటన ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందని స్థానికులు భావిస్తున్నారు. సబ్బని వెంకట్ కోదండరాం సంయుక్తంగా ప్రెస్ నోట్ విడుదల చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ శాసనమండలి వేదికగా డంపింగ్ యార్డ్ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు నోరు మెదపని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా స్పందించడంలో సబ్బని వెంకట్ ఉద్యమ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ నిపుణులు, వైద్యులు డంపింగ్ యార్డ్ వల్ల వాతావరణ కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు, త్రాగునీటి విషతుల్యం, పంట భూముల శాశ్వత నాశనం తప్పవని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత రగిలిస్తోంది. ఈ అంశంపై త్వరలో మున్సిపల్ శాఖ మంత్రిని కలుస్తామని, అక్కడ కూడా స్పందన లేకపోతే ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడబోమని సబ్బని వెంకట్ స్పష్టం చేశారు. ప్రజల కోసం, హుజురాబాద్ భవిష్యత్తు కోసం చివరి నిమిషం వరకు పోరాడతానని ఆయన ఇచ్చిన స్పష్టమైన సంకేతాలు రాజకీయ వర్గాల్లో ఉలిక్కిపాటుకు కారణమవుతున్నాయి. డంపింగ్ యార్డ్ అంశం ఇక కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది హుజురాబాద్ ప్రజల ఆరోగ్యం, జీవన హక్కులు, భవిష్యత్తు తరాల భద్రతకు సంబంధించిన ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల గొంతును వినాలనే డిమాండ్ రోజు రోజుకీ బలపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *