తిరుమలాపురంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

పయనించే సూర్యుడు జనవరి 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని తిరుమలాపురం గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం గురువారంతోవిజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగులవంచ ప్రిన్సిపల్ పి నవీన్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. వారం రోజులు పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు సేవా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పరిసరాలతో మమేకం అవడం అభినందనీయం అని అన్నారు. అలాగే జీవితంలో తల్లిదండ్రులకు సహాయం చేయడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. తిరుమలాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు మాట్లాడుతూ, వారం రోజులపాటు గ్రామానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసించారు. ఇంకుడు గుంటలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మంచి మార్గంలో నడుచుకుంటూ ఇతరులకు సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లకు డిసిఓ ఎన్. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ నవీన్ బాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. మల్లయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జి. నాగమణి, వార్డు మెంబర్స్ అరుణ, విజయ, సిహెచ్. మధు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కళాశాల సిబ్బంది వరప్రసాద్, ఆయుబ్ ఖాన్, కృష్ణారావు, అల్లు విజయ్, వెంకట్ రెడ్డి, శ్రీనివాసరావు, రాంబాబు, నాగేశ్వరరావు, వీరాంజనేయులు, ఐలేశ్వర్, వేణుగోపాల్, ఉష, పద్మావతి, యశోద, సాయి చరణ్, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *