
పయనించే సూర్యుడు, జనవరి 9, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం బచ్చన్నపేట మండలంలో పర్యటించి, యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా ఎరువుల సరఫరా, పంపిణీ పరిస్థితులు, యూరియా బుకింగ్ యాప్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాకా గోపాల్ నగర్, పీఏసీఎస్ బచ్చన్నపేట, ఎంజీసీ బచ్చన్నపేట కేంద్రాలను సందర్శించి అక్కడి నిల్వలు, అమ్మకాలు, బుకింగ్ విధానం, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు. గురువారం నాటికి అందుబాటులో ఉన్న ప్రారంభ యూరియా నిల్వలను అధికారులు కలెక్టర్ కి వివరించారు. పీఏసీఎస్ బచ్చన్నపేటలో 1067 బ్యాగులు, ఎంజీసీ బచ్చన్నపేటలో 333 బ్యాగులు, హాకా గోపాల్ నగర్‌లో 444 బ్యాగులు నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మూడు కేంద్రాలలో ఉన్న రైతులను యూరియా బుకింగ్ యాప్ అమలుపై అభిప్రాయాలను తెలుసుకోగా యాప్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకోవడం వల్ల వరుసలో నిలబడాల్సిన అవసరం లేకుండా, సమయం వృథా కాకుండా సులభంగా యూరియా పొందగలుగుతున్నామని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ అమలుతో పారదర్శకత పెరిగిందని, అనవసరమైన గందరగోళం తగ్గిందని రైతులు తెలిపారు. అలాగే రైతులు పండిస్తున్న పంటల గురించి కలెక్టర్ అడగగా కోతుల బెడద కారణంగా వేరుశనగ, చిరుధాన్యాలు వంటి ఇతర పంటలను సాగు చేయలేకపోతున్నామని, ప్రధానంగా వరి పంటనే సాగు చేస్తున్నామని ఎక్కువ మంది రైతులు తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో యూరియా నిల్వల పరిస్థితిపై కలెక్టర్ కి వ్యవసాయ అధికారులు విపులంగా వివరించారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున సుమారు 7500 బ్యాగుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని, యూరియా బుకింగ్ యాప్‌కు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. యాప్‌లో నమోదవుతున్న బుకింగ్స్ సంఖ్య రైతుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రిజర్వ్ పూల్ (సి ఆర్ పి) నుండి జనగామ జిల్లాకు 2000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మార్క్‌ఫెడ్‌కు 29,333 బ్యాగుల యూరియాకు ఇండెంట్ ఇవ్వగా, ఇప్పటికే 12,888 బ్యాగులు జిల్లాకు చేరాయని తెలిపారు. మిగిలిన 16,445 బ్యాగులు ఒక రోజులో జిల్లాకు చేరనున్నాయని పేర్కొన్నారు. అదనంగా బఫర్ స్టాక్‌లో ఉన్న 15,111 బ్యాగులకు ఈ రోజే ఇండెంట్ ఇవ్వగా, అవి శనివారానికి జిల్లాకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఇదే సమయంలో ప్రైవేట్, మార్క్‌ఫెడ్ ద్వారా మరిన్ని రేకులు జిల్లాకు రానున్నాయని, అందువల్ల జిల్లాలో యూరియా కొరతకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగాలని, యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో యూరియా అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ పరిశీలన కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.