పయనించే సూర్యుడు జనవరి 9 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ మలి విడత తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి, డప్పు సంకనేసుకుని రాత్రింబవళ్లు ఉద్యమ పాటలతో పల్లె పల్లెనా ధూమ్‌ధాం జాతరలా ప్రజలను ఏకం చేసి, ఊరు వాడ ఉద్యమ స్వరాలతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కొంతమందికే ఉద్యోగాలు కల్పించి, మిగిలిన కళాకారులను విస్మరించిన గత ప్రభుత్వం కాలయాపన చేసి తప్పించుకుందని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుని మిగిలిన తెలంగాణ ఉద్యమ కళాకారులందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించబోయే నిరుద్యోగ కళాకారుల మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు బిజినపల్లి మండలంలో జరిగిన సమావేశంలో ప్రముఖ బహుజన నాయకులు ఎం. మహేందర్, జి. వెంకటయ్య, ఉద్యమ కళాకారులు శ్రావణ్ కుమార్, కాశీ దాస్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులు కన్న కలను నిజం చేసిన కళాకారులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.