పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 బోధన్: బోధన్ పట్టణంలో ఆదివారం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో అమరుడు కామ్రేడ్ శావులం సాయిలన్న 30 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ ఆనాటి పీపుల్స్ వార్ మూఠ కు చెందిన కొందరు వ్యక్తులు1996 జనవరి 10 రాత్రిపూట మంగళ్ పాడు లోని ఆయన ఇంటి నుండి పట్టుకెళ్ళి చిత్ర హింసల పాలు చేసి, కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశారని ఆయన పోలీస్ ఇన్ ఫార్మర్ అని తప్పుడు ఆరోపణలు చేశారని అట్టి ఆరోపణలు నేటికి నిరూపించలేకపోయారని తీవ్రంగా విమర్శించారు. ఆయన గ్రామస్థాయి నుండి మండలం డివిజన్ జిల్లా స్థాయి వరకు అంచలంచలుగా ఎదిగారని రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపులలో రైతు కూలీలను పోరాటాలకు కదిలించారని, ఆనాడు జరిగిన నిజాంసాగర్ నీటి కోసం, మల్లెపాడు భూముల కోసం, ఎన్ఎస్ఎఫ్ భూములను ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలని పోరాటాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. కామ్రేడ్ శావులం సాయిలన్న ఏ విధంగా రైతులు, కూలీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అందరినీ సంఘటితపరిచి పోరాటాలను చేశారో అదేవిధంగా నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇర్షాద్, నాగన్న, శంకర్, పోశెట్టి, మైబూబ్, షకీల్, సాయిలు, అశోక్, గంగాధర్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.