
పయనించే సూర్యుడు జనవరి 14, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం లో ఉన్న రైల్వే స్టేషన్ దుస్థితితో దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రయాణికులకు సేవలు అందించాల్సిన రైల్వే స్టేషన్ ప్రస్తుతం విధ్వంసానికి నిలయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్ల స్టేషన్ ప్రాంగణం పాడుబడిన భవనాన్ని తలపిస్తోంది. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అక్కడ టికెట్ ఇచ్చే నాథుడే లేడు .స్టేషన్‌కు వస్తున్న ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సిబ్బంది కరువయ్యారు. టికెట్ కౌంటర్లు ఉన్నా, అక్కడ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో చాలామంది టికెట్ లేకుండానే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ తనిఖీల్లో పట్టుబడితే జరిమానాలు ఎవరికి కట్టాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గదులకు ఉండాల్సిన కిటికీలు, తలుపులు పూర్తిగా విరగొట్టి ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఆ గదుల్లో ఉండాలంటే భయపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆ గదులు నిలయంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ధ్వంసమైన మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్, కిటికీ రెక్కలు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. స్టేషన్ అంతా చెత్తాచెదారం, దుమ్ముతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉంది. విరిగిన కిటికీలు, సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు. ప్రయాణికుల పాలిట నరకప్రాయం గా మారిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే టికెట్ కౌంటర్లలో సిబ్బందిని నియమించాలని, ధ్వంసమైన గదులకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
