ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

*మాట్లాడుతున్న బోధన్ ఎసిపి శ్రీనివాస్. * సాలూరలో ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 బోధన్ :ట్రాఫిక్ నియమాలను పాటించడం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని బోధన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులతో పాటు జిల్లా సిపి ఆదేశాల మేరకు మంగళవారం సాలూర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వాహనదారులు తూచా తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.లేనియెడల జరిమానాలతో పాటు జైలు శిక్ష అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం పట్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని మృత్యువాత పడుతున్న సందర్భాలు ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలలో అనేక మంది యువకులు మరణించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన సందర్భాలు ఎన్నో అన్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దలు మృత్యువాత పడి కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు లేకపోలేదు అన్నారు. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చి దిద్దుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించి కాపాడినట్లయితే వారికి ప్రోత్సాహంగా 25 వేల రూపాయలను అందజేయడంతో పాటు ఇలా 5 సార్లు సహాయం చేసిన వారికి అదనంగా లక్ష రూపాయలను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ప్రమాద రహిత తెలంగాణను సాధించుకుందాం అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏసిపి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు ఇల్తె శంకర్, సొక్కం రవి, ఉపసర్పంచ్ సురేష్ పటేల్, పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *