కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అరైవ్ అలైవ్ క్యాంపైన్ అవగాహన సదస్సు

పయనించే సూర్యడు / జనవరి 17/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సిబ్బందికి కుషాయిగూడ పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ కె. మనోహర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సదస్సులో ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, కుషాయిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ రామలక్ష్మణ రాజు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎన్. వెంకన్న, సిహెచ్. సాయిలు, శ్రీకరన్ హాస్పిటల్ డాక్టర్ రజినీకాంత్ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.ప్రత్యేకంగా, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు మరియు ప్రమాద బాధితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, వారి అనుభవాలను ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా సదస్సుకు భావోద్వేగ పూరితతను తీసుకొచ్చారు. వారి మాటలు అందరిలోనూ జాగ్రత్తగా ఉండాలనే భావనను మరింత బలపరిచాయి.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, రోడ్ సేఫ్టీ సిబ్బంది, ఆర్టీసీ యూనియన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *