అపర బద్రాద్రి దేవస్థానంలో అక్రమాల ఆరోపణలు

* కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు దేవస్థానం పాలకవర్గం వినతి * ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత లేదని చైర్మన్ ఆరోపణ * హుండీ లెక్కలు, లీజులు, ఆదాయంపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ డిమాండ్

పయనించే సూర్యుడు / మార్చి 10 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ఇల్లంతకుంటలో అపర బద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై దేవస్థానం పాలకవర్గం సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్‌తో పాటు వరంగల్ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లను కలిసి వినతిపత్రం సమర్పించింది. దేవస్థానం వ్యవహారాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ అపర బద్రాద్రి దేవస్థానానికి శాశ్వత కార్యనిర్వాహణ అధికారి (ఈవో)ని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన పలు వ్యవహారాల్లో పారదర్శకత లేకపోవడంతో భక్తులు, గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేవస్థానానికి చెందిన స్థలాలను లీజుకు ఇస్తూ ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే లడ్డు, పులిహోర తయారీ పనులను సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి అప్పగించడం వల్ల నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆలయ ఆవరణలో జరిగే వివాహ కార్యక్రమాలకు సంబంధించి అధికారిక రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. దీంతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని అన్నారు. దేవస్థానానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా కూలిపోయినా పునర్నిర్మాణ పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు రూ.10 లక్షల వరకు నిధులు వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన ఆదాయం, తహసీల్దార్ కార్యాలయం నుండి వచ్చిన రూ.11,649 ఆదాయానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం లేదని తెలిపారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన మహోత్సవాల హుండీ లెక్కలు ఇప్పటివరకు కమిటీకి, భక్తులకు తెలియజేయలేదని పేర్కొన్నారు. దేవస్థానం కమిటీ నిర్ణయాలను పక్కనపెట్టి, కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇద్దరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని చైర్మన్ తీవ్రంగా విమర్శించారు. ఈ పరిస్థితులు భక్తులకు, గ్రామస్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొంటూ దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవస్థానం పాలకవర్గం కోరింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *