పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 11, తల్లాడ రిపోర్టర్ మార్చి 12న భక్త రామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు వంటి ప్రజా ప్రతినిధులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, ఫైల్ క్లియరెన్స్, మార్చి12న సర్పంచ్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేయనున్న శిక్షణ కార్యక్రమంపై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అంశంపై ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.పారిశుధ్య నిర్వహణ, ఫైల్స్ క్లియరెన్స్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. క్షేత్ర స్థాయి సందర్శనలో సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ల భాగస్వామ్యం, పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో ఉండటం గమనించినట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 12న భక్త రామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ప్రజా ప్రతినిధికి ఆహ్వానం అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వివిఐపి, వి.ఐ.పి. లకు ఆహ్వానం అందేలా జాగ్రత్తలు పాటించినట్లు అన్నారు. శిక్షణ కార్యక్రమానికి వచ్చే ప్రజా ప్రతినిధులకు అవసరమైన ఆహారం, ఇతర ఏర్పాట్లు కూడా కల్పించామని, ఆడియో, వీడియో వ్యవస్థ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఉదయం సెషన్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ, 10 థీమ్స్ లో వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంపై అవగాహన కల్పిస్తామని, లంచ్ అనంతరం పిఆర్ చట్టం, మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం సంబంధించి మినెట్ టు మినెట్ ప్రోగ్రాం షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పిఆర్ చట్టంపై ఇది వరకే శిక్షణ అందించినందున, దానికి కొంత సమయం కేటాయించి, మున్సిపల్ యాక్ట్ ముఖ్యమైన అంశాలు క్లియర్ గా తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. శిక్షణ కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా ఇంటారాక్టివ్ సెషన్ పెట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, విద్య, వైద్య శాఖలో చేపడుతున్న చర్యలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, వాటి అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, సిపీఓ ఏ. శ్రీనివాస్, డిఆర్డిఓ కె. శ్రీరాం, డిపిఓ రాంబాబు, మునిసిపల్ కమీషనర్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.