పయనించే సూర్యుడు మార్చ్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) బుర్డిపాడ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు స్వయం పాలనా దినోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి తమ ప్రతిభను చాటారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా మానస, మండల విద్యాశాఖ అధికారిగా నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా సంధ్య బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయులుగా విజయలక్ష్మి, అక్షయ, ప్రవళిక, తులసి, నాగతేజ, హరికృష్ణ, సందీప్, సాత్విక్, శరత్ తమ విధులను అత్యంత క్రమశిక్షణతో నిర్వర్తించారు. ఒకరోజు పాటు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం తమకు ఎంతో సంతృప్తిని, విజ్ఞానాన్ని ఇచ్చిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజిత్, మంజుల పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.