ప్రజా ఆరోగ్యమే పరమావధి: కల్తీ పదార్థాలపై ఉక్కుపాదం మోపండి

జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదేశం.

పయనించే సూర్యుడు మార్చ్ 15 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కల్తీ ఆహార వ్యాపారాలపై నిరంతరం దాడులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (జెసి) నూరుల్ కమర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ అధ్యక్షతన జరిగిన ‘జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి’ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు: ఆహార భద్రతపై ప్రత్యేక నిఘా రోడ్డు పక్కన తినుబండారాలు: పానీపూరి, చాట్ బండార్లతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రుచి, రంగు కోసం ప్రభుత్వం నిషేధించిన రసాయనాలు వాడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై రోజువారీగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. హోటళ్లు & రెస్టారెంట్లు: పట్టణాల్లోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆహార నమూనాలను సేకరించి పరీక్షించాలని, నాణ్యత లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రతా అధికారులను ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్: ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు వాడుతున్న వ్యాపార సంస్థలపై మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు నిఘా పెంచి కేసులు నమోదు చేయాలన్నారు. వినియోగదారుల హక్కులు – రక్షణ. ఎలక్ట్రానిక్ వస్తువులు: వేసవి దృష్ట్యా ఎమ్మార్పీ ధరలు లేని, ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన, నాసిరకం ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే సంస్థలపై తూనికలు – కొలతల శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో అవేర్‌నెస్: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ‘కన్జ్యూమర్ క్లబ్బులు’ ఏర్పాటు చేసి విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని మండలి సభ్యులను కోరారు.వైద్యం & తాగునీరు ఆసుపత్రుల నిర్వహణ: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతిరోజూ బెడ్ షీట్లు మార్చడంతో పాటు ఉచిత తాగునీరు కల్పించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. హాస్టల్ వసతులు: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్యతను మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీసుకోవాలన్నారు. గ్యాస్ వినియోగదారులకు భరోసా జిల్లాలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసా బాషా, జిల్లా అధికారులు మరియు వినియోగదారుల మండలి సభ్యులు పాల్గొని పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *