చర్లపల్లి ఐజీ కాలనీలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

* బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు * ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

పయనించే సూర్యడు / మార్చ్16/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజీ కాలనీలో బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళల కోసం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు, ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి మహిళా ఏడాదికి ఒకసారైనా ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ లావణ్య, డాక్టర్ సందీప్, డాక్టర్ కృష్ణ తమ బృందంతో కలిసి వైద్య సేవలు అందించారు. సుమారు 120 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స కోసం సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. సీతారాం రెడ్డి, ప్రభు గౌడ్, గోపాల్ యాదవ్, ప్రకాష్ రెడ్డి, భాను తదితరులతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొంతు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవలను స్థానికులు ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *