
పయనించే సూర్యడు / మార్చ్ 16/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు న్యాయ సేవలను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రెండు కొత్త ‘మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లను’ (మల్టీ యుటిలిటీ వాహనాలు) అందుబాటులోకి తెచ్చింది. శనివారం ఉదయం హైదరాబాద్ హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హెచ్ఐసిసి లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విక్రమ్ నాథ్ ఈ వాహనాలను ప్రారంభించారు. నల్సా నిధులతో కొనుగోలు చేసిన ఈ ఫోర్స్ ట్రావెలర్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ లీగల్ సర్వీస్ యూనిట్లుగా పనిచేస్తాయి. వీటి ద్వారా ప్రధానంగా ఈ క్రింది సేవలు అందుతాయి, పేదలు, బలహీన వర్గాలకు ఎటువంటి ఖర్చు లేకుండా చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. గ్రామాల్లో చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మారుమూల ప్రాంతాల బాధితులు నేరుగా న్యాయవాదులతో మాట్లాడేందుకు ఇందులో సాంకేతిక సౌకర్యం ఉంది. వివిధ చట్టాలపై రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ఈ వ్యాన్ల ద్వారా ప్రదర్శిస్తారు. వివాదాలను త్వరగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ వాహనాలు క్షేత్రస్థాయిలో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 34 జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలకు కేవలం 4 వ్యాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఈ రెండు వాహనాలతో కలిపి మొత్తం 6 వ్యాన్లు నెలవారీ రొటేషన్ పద్ధతిలో అన్ని జిల్లాల్లో తిరుగుతాయి. సంబంధిత జిల్లా ప్రధాన న్యాయమూర్తి (రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ చైర్మన్)ఆధ్వర్యంలో ఒక నెల ముందుగానే టూర్ షెడ్యూల్ ఖరారు చేసి, గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనిరుద్ధ బోస్, హైకోర్టు న్యాయమూర్తులు పి. సామ్ కోషి, కె. లక్ష్మణ్, ఇతర న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ
సభ్య కార్యదర్శి సిహెచ్. పంచాక్షరి ఏర్పాట్లను పర్యవేక్షించారు.