అమరవీరుల సాక్షిగా కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పోరాటం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

పయనించే సూర్యుడు మార్చ్ 17(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘన నివాళులర్పించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ నివాళి కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఈ బడ్జెట్‌లో ఆ హామీల అమలు కోసం స్పష్టమైన నిధులు కేటాయించాలని పట్టుబట్టారు. సభ ప్రారంభానికి ముందే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం, ప్రజల పక్షాన అసెంబ్లీ లోపల మరియు బయట తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *