ఎన్‌ఎఫ్‌సి ఆర్‌ఓబీని వెంటనే విస్తరించాలి

* మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ నిరసన * ట్రాఫిక్ నరకంతో వాహనదారుల విలవిల * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై కోమటి రవి ఆగ్రహం

పయనించే సూర్యడు / మార్చ్ 17/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కాప్రా సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) ఇరుకుగా ఉండటంతో వాహనదారులు, కార్మికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోమటి రవి డిమాండ్ చేశారు. సోమవారం మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో సిపిఎం కాప్రా సర్కిల్ కమిటీ, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని విమర్శించారు. ఎన్‌ఎఫ్‌సి, ఈసీఐఎల్, మింట్, బీపీసీఎల్, ఐఓసీఎల్, బెల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు చర్లపల్లి పారిశ్రామిక వాడలోని వేలాది పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు నిత్యం ఈ మార్గం గుండానే ప్రయాణిస్తారని రవి గుర్తుచేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాహనాల రద్దీ అసాధారణంగా పెరిగిందని, ఫలితంగా ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొందని, భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రమాదాల ముప్పు పొంచి ఉందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. చర్లపల్లి, నాచారం, మల్లాపూర్, మౌలాలి ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్‌ఓబీ విస్తరణకు నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో కాలనీవాసులు, కార్మికులు, విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కోమటి రవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పి.గణేష్, జి.శ్రీనివాసులు, వెంకట చారి, ప్రసాద్, సత్యనారాయణ, శివనారాయణ, శ్రీమన్నారాయణ, వివిధ కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు జగ్గారాజు, దేవిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *