పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 18 ఏదుల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్ట్‌కు 436 మీటర్ల ఎత్తు నుండే నీటి సరఫరా చేయాలని ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ ఆదేశానుసారం మంగళవారం చండూరు తాసీల్దార్ రమాకాంత్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా డిండి ఎత్తిపోతల పథకం ద్వారా చండూరు మండల ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తామని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికోసం చర్లగూడెంతో పాటు పలు రిజర్వాయర్లను 30 టీఎంసీల నీటిని నింపడానికి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఏదుల రిజర్వాయర్‌కు అటు నుండి ఒకవైపు పట్టెం రిజర్వాయర్‌కు మరోవైపు డిండి కాల్వలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ రెండు వైపులా నీటిని ఏదులా రిజర్వాయర్ లోని 436 మీటర్ల ఎత్తు నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఇంజినీర్లు 436 మీటర్ల ఎత్తు వద్ద నుంచి పట్టెం రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారని, పైగా ఆరు మోటర్ పంపులకు బదులు రెండు టీఎంసీలు తీసుకునే విధంగా ఎనిమిది మోటార్లతో పాటు అదనంగా మరో మోటార్‌ను బిగించారని తెలిపారు. దీని ద్వారా ఏకంగా రోజుకు రెండు టీఎంసీలకు పైగా నీటిని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. డిండి కాలువలకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నుండి నీటిని తీసుకోవాలని తప్పుడు పద్ధతిలో నిర్ణయించి ఈఎన్‌సీకి సిఫారసు చేసి సంతకాలు చేయించారని తెలిపారు. ఇంజినీర్ల ద్వంద నీతి నిర్ణయంతో డిండి కాలువకు కృష్ణా జలాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతిలో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీరు వచ్చే అవకాశం లేకుండా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది కావున దయచేసి ఏదుల రిజర్వాయర్ నుండి ఇరువైపులా 436 మీటర్ల ఎత్తు నుండి నీటిని సరఫరా చేసి ప్రజలను కరువు, కాటకాలు, ఫ్లోరోసిస్ బాధితులతో నిండిపోయిన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చెడుబుద్ధి రమేశ్, ఇరిగి నాగరాజు, తోటి ప్రశాంత్, పోలే లోకేశ్ పాల్గొన్నారు.