పయనించే సూర్యుడు మార్చి 19, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: గోనయో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి తన పుట్టినరోజును పురస్కరించుకొని సామాజిక స్పృహను చాటుకున్నారు. ఆడంబరాలకు దూరంగా, తోటివారికి సాయపడాలనే సంకల్పంతో ఘట్‌కేసర్‌లోని “అమ్మానాన్న సేవా ట్రస్ట్” వృద్ధాశ్రమంలో ఒక రోజు మొత్తం అన్నదాన కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వడ్ల ప్రశాంత్ మాట్లాడుతూ కన్నతల్లిదండ్రులే దైవ సమానులని, వారి ఆశీస్సులతో పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. “మనల్ని పెంచి పెద్దచేసి, మన భవిష్యత్తుకు బాటలు వేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో ఉండటం సమాజానికి బాధాకరం. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలతో ఆనందంగా గడిపే రోజులు రావాలని, భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరమే లేని సమాజం ఏర్పడాలని నా కోరిక” అని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వృద్ధాశ్రమంలో ఉన్న వారికి ప్రేమ, ఆదరణ అందించడం మనందరి బాధ్యతని, అందుకే తన వంతుగా ఈ చిన్న సాయం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రశాంత్ చారి చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు అభినందించారు.