పయనించే సూర్యుడు మార్చి 20 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామంలో “సేవయే లక్ష్యం – సమాజమే దేవాలయం” అనే నినాదంతో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. గత ఏడు రోజులుగా గ్రామంలో అంకితభావంతో సేవలు అందించిన విద్యార్థుల కృషిని గ్రామస్తులు, కళాశాల యాజమాన్యం ప్రశంసించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రీమతి రమ్య, నవత పర్యవేక్షణలో ఈ శిబిరం క్రమశిక్షణతో సాగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలెం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సుహాసిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే విద్యార్థులు సంపూర్ణ వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు” అని పేర్కొన్నారు. గ్రామంలో పారిశుధ్యం, ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించిన వాలంటీర్ల సేవలను ఆమె అభినందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముగింపు రోజున విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ నమూనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమగ్ర వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ఎరువుల తయారీ, పంట మార్పిడి, తెగుళ్ల నివారణ వంటి అంశాలను విద్యార్థులు నమూనాల ద్వారా వివరించగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సందేహాలను ఓపికగా నివృత్తి చేశారని అన్నదాతలు అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల పాటలు, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం, శిబిరంలో ప్రతిభ కనబరిచిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అలాగే గ్రామ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లెక్చరర్లు మోతీలాల్ నాయక్, వైష్ణవి నాయకత్వం వహించగా, మాజీ సర్పంచ్ వెంకటయ్య, వినోద్ సభను ఉద్దేశించి మాట్లాడి కళాశాల సిబ్బందిని సన్మానించారు. విద్యార్థులు కావ్య, శివాని, జగన్, శంకర్ తమ అనుభవాలను పంచుకుని రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బంగారమ్మ, మాజీ సర్పంచ్ వెంకటయ్య, వినోద్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.