ప్రభుత్వాల ఉచిత వాగ్దానాలు ప్రజల దగాకే

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ​అశ్వారావుపేటలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలతో ప్రజలను వంచిస్తూ, అధికారంలోకి వచ్చాక రైతాంగం, కూలీల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, ప్రజా నేత గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా మొదటి మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా సంఘం జిల్లా అధ్యక్షులు నాయని రాజు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సభకు దాసరి సాయి, అమర్లపూడి రాము, ముద్దా బిక్షం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, జిల్లా కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన గుమ్మడి నరసయ్య ​ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య తన శైలిలో ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రోజుకు వెయ్యి రూపాయలు కూలి ఇచ్చినా కనీస అవసరాలు తీరని పరిస్థితి ఉందని, కానీ కూలీలకు అంత వేతనం ఇచ్చే నాథుడే లేడని, మన కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్ ప్రసంగాలు వినడానికి విందు భోజనంలా ఉన్నా, ఆచరణలో పేదవాడి కడుపు కొట్టేలా ఉన్నాయని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను విస్మరించి, మళ్లీ కొత్త పేర్లతో పథకాలు తెచ్చి జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా రైతులు పోరాడి రద్దు చేయించిన నల్ల చట్టాలను, మోడీ ప్రభుత్వం మళ్లీ పేర్లు మార్చి దొడ్డిదారిన అమలు చేస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజివిక గా పేరు మార్చడం పేదల హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. మావోయిస్టుల లొంగుబాటుపై వ్యాఖ్యలు ​ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ నిన్నటి వరకు తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని నమ్మిన మావోయిస్టులు నేడు లొంగిపోతున్నారని, వారి భవిష్యత్తు ఏంటో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
పోరాటమే ఏకైక మార్గం ​మన దేశం వనరులు ఉన్న గొప్ప దేశమని చెబుతారే తప్ప, ఆ సంపద పేదరికంలో మగ్గుతున్న రైతు కూలీలకు ఎందుకు దక్కడం లేదని ఆయన ప్రశ్నించారు. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ప్రగతిశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని రైతు కూలీలకు పిలుపునిచ్చారు. అలరించిన అరుణోదయ కళారూపాలు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల సందర్భంగా అరుణోదయ కళాకారులు వేసిన కళారూపాలు అలరించాయి. ఎర్రజెండా పాటలు, నృత్యాలతో, డప్పు మోతలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *