పయనించే సూర్యుడు, మార్చ్ 22, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న నిర్వహించనున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినట్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బంగారు మహేష్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి ఉద్యోగావకాశాలు, మహిళలకు భద్రత మరియు సంక్షేమ పథకాలు వంటి అనేక హామీలను ప్రకటించినప్పటికీ,వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు లో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి మాట తప్పిందని, రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో ఇవ్వాల్సిన మొత్తం ఎకరాకు 18,000 చొపన రావలసిన రైతు భరోసా డబ్బులను ఇప్పటి వరకు విడుదల చేయకుండా ఎగ్గొట్టిందని తీవ్రంగా విమర్శించారు. వెంటనే రైతుల ఖాతాల్లో ఇట్టి పెండింగ్ రూపాయలు 18,000 జమ చేయాలని డిమాండ్ చేశారు.యువతకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, పెళ్లయిన అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ హామీలను నిలబెట్టుకోలేకపోయినచో ఈ ప్రభుత్వానికి నిరసనగా ధర్నా ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడంతో యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే తమ వైఖరిని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. బచ్చన్నపేట మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.