బాలానగర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం తరలింపు యత్నం

పయనించే సూర్యుడు 24 మార్చి2026 ఊరుకోబోమని హెచ్చరించిన దళిత సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు బాలానగర్: బాలానగర్ మండల కేంద్రం నడిబొడ్డున, దశాబ్దాలుగా వెలుగులు విరజిమ్ముతున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంపై ప్రభుత్వ కన్ను పడింది. రోడ్డు విస్తరణ పేరుతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన బాబాసాహెబ్ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. “మా జాతి గర్వకారణం, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడి విగ్రహాన్ని రోడ్డు విస్తరణ సాకుతో ఎక్కడో ఒక మూలకు విసిరేయాలని చూడటం అన్యాయం” అని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. విగ్రహం ఉన్న ప్రాంతం కేవలం ఒక విగ్రహం కాదు, అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ గౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా, ఆ విగ్రహం చెంతనుండి ఒక అంగుళం కదిలించినా ఊరుకునే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. మా నిర్ణయం ఒకటే: సంత రోడ్డులోనే విగ్రహం! ఒకవేళ విస్తరణ దృష్ట్యా తరలింపు తప్పనిసరి అయితే, విగ్రహాన్ని అత్యంత గౌరవప్రదంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉండే “సంత రోడ్డు” లోనే ప్రతిష్టించాలని స్థానిక ప్రజలు, దళిత సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు తావులేదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. తమ ఆత్మగౌరవ ప్రతీకను రక్షించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాబాసాహెబ్ గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్థానికుల కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అధికారుల తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమం లో వివిధ ప్రజా సంఘాల నాయకులు , అంబేద్కర్ సంఘం నాయకులు, ఎమ్మార్పిఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *