ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్

అశ్వారావుపేటలో ఘనంగా వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట, భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో తన రక్తాన్ని ధారపోసి, 23 ఏళ్ల చిన్న ప్రాయంలోనే “ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దాడిన విప్లవ కిశోరం షహీద్ భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు అశ్వారావుపేటలో ఘనంగా జరిగాయి. సోమవారం అశ్వారావుపేట మండల కేంద్రంలోని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ డివిజన్ కార్యదర్శి కావడిగుండ్ల సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, పి వై ఎల్ మండల కార్యదర్శి కుంజా అర్జున్ లు మాట్లాడుతూ భగత్ సింగ్ కేవలం విప్లవకారుడు మాత్రమే కాదని, ఆయన గొప్ప మేధావి మరియు సామాజిక సిద్ధాంతకర్త అని కొనియాడారు. జైలు గోడల మధ్య ఉండి కూడా వందలాది పుస్తకాలు చదివి జ్ఞానమే ఆయుధం అని చాటిన భగత్ సింగ్, నేటి యువతకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. నాడు తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడితే, నేడు కార్పొరేట్ శక్తుల దోపిడీపై యువత గళం విప్పాలని పిలుపునిచ్చారు. బ్రిటీష్ వారు తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బాంబులు వేసి, భయపడకుండా లొంగిపోయి కోర్టు ద్వారా తన వాదనను ప్రపంచానికి వినిపించిన ధైర్యశాలి భగత్ సింగ్ అని గుర్తుచేశారు. దేశభక్తి అంటే కేవలం జెండా పట్టుకోవడం కాదు, సమాజంలోని పేదరికం, వివక్ష మరియు అవినీతిపై పోరాడటమే అసలైన స్వాతంత్ర్యమని వారు స్పష్టం చేశారు. ​చివరి నిమిషం వరకు లెనిన్ జీవిత చరిత్రను చదువుతూ ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు అని జైలర్‌తో అన్న భగత్ సింగ్ మాటలు నేటికీ రోమాంచితం కలిగిస్తాయని నాయకులు అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో సభను ముగించారు. ​ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, కంగాల కన్నయ్య, సోడెం ముత్యాలు, మద్దులమడ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ శ్యామల సావిత్రి, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు తెల్లం సత్యం, జోడె సుధాకర్, మడివి వెంకటరావు, సోయం కామరాజు, కొడిమి రాజు, మోసం సుబ్బారావు, శ్యామల సీతయ్య కార్యకర్తలు మరియు స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *