
పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 25, తల్లాడ రిపోర్టర్ ప్రణాళిక ప్రకారం ఎస్సీ అభివృద్ధి నిధులు పూర్తి స్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలలో ఎస్సీ అభివృద్ధి ఫండ్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, మహిళా శిశు సంక్షేమ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్లానింగ్, మిషన్ భగీరథ, ఎన్పీడీసీఎల్, ఎస్సీ అభివృద్ధి శాఖ, మొదలగు వివిధ శాఖల పరిధిలో ఎస్సీ అభివృద్ధి ఫండ్ నిధుల వినియోగంపై చర్చించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఎస్సీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి శాఖ పరిధిలో షెడ్యూల్ కులాల లబ్ధిదారు లకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలో సాగు ఆధునీకరణ, ఇతర అభివృద్ధి పథకాలు ఎస్సీ రైతులకు అమలు చేయడంలో కొంత వెనుకబడి ఉన్నామని, రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హార్టికల్చర్ విభాగంలో ఆయిల్ పామ్, మైక్రో ఇరిగేషన్ పథకాలలో ఎస్సీలకు కేటాయించిన లబ్ధిదారులు 20 శాతం కూడా చేరుకోకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఆరోగ్య లక్ష్మీ స్కీంను మరింత మెరుగ్గా అమలు చేసి పూర్తి స్థాయిలో నిధులు వినియోగించాలని అన్నారు. ప్రతి శాఖకు విడుదల చేసే నిధులలో ఎస్సి లకు, ఎస్టీలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలని అన్నారు. ఎస్సి అభివృద్ధి నిధుల వినియోగంపై రిపోర్ట్ పకడ్బందీగా తయారు చేసి పంపాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, ఈడీ ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, సిపిఓ ఏ. శ్రీనివాస్, డిడబ్ల్యూఓ వేల్పుల విజేత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, డిఆర్డీవో కె. శ్రీరామ్, పిడి హౌసింగ్ బి. శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, పోలీస్, విద్యుత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.