పయనించే సూర్యుడు మార్చి 26 రాజేష్) దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. పరీక్షకు హాజరైన 13 మంది విద్యార్థుల్లో 11 మంది అర్హత సాధించి ప్రతిష్టాత్మక గురుకుల విద్యాసంస్థల్లో సీట్లు పొందడం విశేషంగా నిలిచింది. ఈ విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దాసరి నిహాస్విని 90 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది. విద్యార్థుల ఈ విజయానికి ఉపాధ్యాయులు త్యాగరాజు, నవీన్ రెడ్డి, రజిత, నర్సింలు, జ్యోతి, స్రవంతి అందించిన ప్రత్యేక శిక్షణ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రతి సంవత్సరం నవోదయ, గురుకుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలిసి ఈ విజయానికి దారి తీసిందని చెప్పారు. గ్రామ సర్పంచ్ పంజ స్వామి విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, గ్రామానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.