
పయనించే సూర్యుడు మార్చి 27 రాజేష్) చేగుంట మండలంలోని మక్క రాజుపేట గ్రామంలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న వై జంక్షన్ ఫ్యామిలీ డాబాలో ఈరోజు విక్రయిస్తున్న ఆహార పదార్థాల పరిస్థితి చూసి గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు షాక్‌కు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, డాబాలో వాడుతున్న మాంసం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం గమనించారని చెప్పారు. అంతేకాకుండా, అక్కడ తయారుచేస్తున్న కూరలు, రొట్టెలపై ఈగలు గుంపులుగా వాలుతూ ఉండటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పరిశుభ్రతకు సంబంధించిన కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడం పై స్థానికులు మండిపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామ మహిళా సంఘాలు, ప్రజలు కలిసి డాబాపై ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కుళ్లిపోయిన మాంసం నిల్వలో ఉండటాన్ని ప్రత్యక్షంగా గుర్తించారు. జి దీనిని చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. “ఇలాంటి ఆహారం తింటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది” అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు స్పష్టంగా హెచ్చరిస్తూ, “ఈ డాబాలో ఎవరూ ఆహారం తీసుకోవద్దు. ఇక్కడ మాంసం, కూరలు అన్నీ కుళ్లిపోయినవే” అని చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే స్థానిక అధికారులు స్పందించి, సంబంధిత డాబాపై తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో భయం, ఆందోళన నెలకొంది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.