రాయికల్ మండలంలో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపనలు

అభివృద్ధి, సంక్షేమం పై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హామీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మార్చి, మార్చి 27 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడింది. రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం రూ.70 లక్షల వ్యయంతో మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. కిష్టంపేట గ్రామంలో రూ.20 లక్షలతో రెండు భవనాలు, భూపతిపూర్‌లో రూ.20 లక్షలతో రెండు, వడ్డే లింగాపూర్‌లో రూ.10 లక్షలతో ఒకటి, వడ్డెర కాలనీలో రూ.10 లక్షలతో ఒకటి, చర్ల కొండాపూర్‌లో రూ.10 లక్షలతో ఒకటి చొప్పున భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో 60కి పైగా మహిళా సంఘ భవనాలు మంజూరు కావడం గర్వకారణమని తెలిపారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, మహిళల బ్యాంకు రుణాలపై రూ.1300 కోట్ల వడ్డీని ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పేదలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. జగిత్యాలలో అత్యధిక పల్లె దవాఖానాలు మంజూరు కావడం జరిగిందని, రూ.235 కోట్లతో 450 పడకల ఆసుపత్రి ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని,ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు కాగా, జగిత్యాలకు 3500,రాయికల్ మండలానికి 911 ఇళ్లు కేటాయించబడినట్లు తెలిపారు.రైతు భరోసా,రుణ మాఫీ,వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. టాటా సంస్థ సహకారంతో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.రాయికల్ పట్టణంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మండలంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మెర్వో నాగార్జున, ఎంపీ ఓ సుష్మా, ఏఈ ప్రసాద్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, సర్పంచులు,ఉప సర్పంచులు, స్థానిక నాయకులు,అధికారులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *