
పయనించే సూర్యుడు మార్చ్ 27 రాజేష్) సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా తోగుట మండలం ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 5 నూతన సీసీటీవీ కెమెరాలను ఈరోజు అయేషా ఫాతిమా ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం తోగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ లాతీఫ్ మరియు తోగుట సబ్ ఇన్స్పెక్టర్ ప్రోత్సాహంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, సీసీటీవీ కెమెరాలు నేరాల నిర్ధారణ, నేరాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నివారించడంలో కూడా ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామ భద్రత కోసం కెమెరాల ఏర్పాటు కు తమ వంతు సహకారం అందించాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కు సహకరించిన గ్రామ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డి మరియు పుల్లగూర్ల రాజిరెడ్డిని శాలువాతో సన్మానించారు. అలాగే కెమెరాల ఏర్పాటు కు కృషి చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తోగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ లాతీఫ్, తోగుట ఎస్సై రవికాంత్ రావు, పంచాయతీ సెక్రటరీ మాధవి, గ్రామ ఉప సర్పంచ్ బోధనం రమేష్, మాజీ ఎంపీటీసీ కొమ్ము శరత్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.