పయనించే సూర్యుడు / మార్చి 28 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ శ్రీ రాముడి కటాక్షంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపీ గౌస్ ఆలం, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ తదితరులు మంత్రితో కలిసి పూజల్లో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో పున్నం సత్యయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఉపశమనం కలిగించేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, జమ్మికుంట రైస్ మరియు కాటన్ మిల్లుల ప్రతినిధులు నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆలయ చైర్మన్, హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, జమ్మికుంట కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేడుకలు భక్తి, ఆనంద వాతావరణంలో కమనీయంగా కొనసాగాయి.
