పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రాజమండ్రి మరియు కాకినాడ పోర్ట్ మధ్య ప్రయాణించే నిత్య ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత కొంతకాలంగా ప్రత్యేక రైలుగా నడుస్తున్న సర్వీసును ఇకపై రెగ్యులర్ మెము ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మారిన రైలు నంబర్లు – వేళలు: ఇప్పటివరకు ప్రత్యేక నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 67301/67302 నంబర్లతో సేవలు అందించనుంది. రైలు నం. 67301: ప్రతిరోజూ తెల్లవారుజామున 6:15 గంటలకు కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరి, ఉదయం 8:15 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. రైలు నం. 67302: మధ్యాహ్నం 3:00 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి, సాయంత్రం 4:40 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు: ఈ రైలు కాకినాడ టౌన్, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు స్టేషన్లతో పాటు అనపర్తి నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రాలైన అనపర్తి, మరియు ద్వారపూడి స్టేషన్లలో ఆగుతుంది. దీనివల్ల ప్రతిరోజూ కాకినాడ, రాజమండ్రి వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారులకు తక్కువ చార్జీతో వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ ప్రయాణ సౌకర్యాన్ని రెగ్యులర్ చేసినందుకు నియోజకవర్గ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.