దళిత గౌరవంపై దాడి – కౌశిక్ రెడ్డిపై ఆగ్రహ జ్వాలలు

* హుజురాబాద్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాదిగ హక్కుల దండోరా ఘాటైన హెచ్చరిక * వెంటనే క్షమాపణ చెప్పాలి – పుల్లూరి కుమార్ మాదిగ డిమాండ్ * దళిత ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ముట్టడి తప్పదు * ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలంటూ తీవ్ర ఆందోళన

పయనించే సూర్యుడు / మార్చి 31 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ వేదికగా దళిత ఎమ్మెల్యేల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత పుల్లూరి కుమార్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా అన్ని దళిత ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అసహనానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. వెంటనే కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు,లేదంటే తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఇదే మొదటిసారి కాదని, గతంలో మహిళా గవర్నర్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దళితుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నందున కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో భారీ దుమారం రేపుతూ, కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *