పయనించే సూర్యుడు మార్చి 31, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జీరో పావర్టీ – పి4 పాలసీ” కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. 2025 ఉగాది పర్వదినాన ‘స్వర్ణ ఆంధ్ర–2047’ లక్ష్యంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. సోమవారం కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పసపులేటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) ముఖ్య అతిథిగా పాల్గొని, గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వెల్లడించారు. సమాజంలోని సంపన్న వర్గాలు (టాప్ 10శాతం) తమ వంతు బాధ్యతగా అట్టడుగున ఉన్న 20శాతం పేద కుటుంబాలను (బంగారు కుటుంబాలు) ఆదుకోవడమే ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని, ప్రభుత్వం కేవలం సమన్వయకర్తగా ఉంటూ ప్రజలు, ప్రైవేట్ సంస్థలను ఈ యజ్ఞంలో భాగస్వాములను చేస్తోందని ఆయన వివరించారు. గడిచిన ఏడాది కాలంలో కాకినాడ రూరల్ పరిధిలో సుమారు 12,348 ‘బంగారు కుటుంబాలను’ అధికారులు గుర్తించగా, వారికి అండగా నిలిచేందుకు 2,788 మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పటికే 7,518 కుటుంబాలను దాతలు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలు, ఫౌండేషన్లు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ మార్గదర్శి ప్రవీణ్ చక్రవర్తి రూ. 20 లక్షల వ్యయంతో 400 మంది గర్భిణీలకు పోషకాహార కిట్లు అందించడమే కాకుండా, 6,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత విద్య, భోజన సౌకర్యాలు కల్పిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.మౌలిక సదుపాయాల కల్పనలో కొరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సుమారు రూ. 3.67 కోట్ల సి.ఎస్.ఆర్ నిధులతో వాకలపూడిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం, పార్కుల అభివృద్ధి, అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ పనులు చేపట్టింది. అలాగే జెమిని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ రూ. 1.54 కోట్లతో సి.సి. డ్రైన్లు, తాగునీటి ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు సహకరించింది. తదేకం, పంతం ఫౌండేషన్లు వికలాంగులకు ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాల పంపిణీ, పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, మత్స్యకార యువతకు ఉపాధి శిక్షణ వంటి సేవా కార్యక్రమాలతో అండగా నిలిచాయి. యూనివర్సల్ బయోటెక్ హెచ్ఆర్ మేనేజర్ , టైకీ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు కూడా సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డా. దివ్య సునీతా రాజ్ బుర్ర, సంజయ్ పి విశ్వస్ రావు వంటి మార్గదర్శులను సత్కరించారు. అందరూ కలిసికట్టుగా సాగిస్తున్న ఈ ప్రయాణం పేదరికం లేని స్వర్ణాంధ్ర నిర్మాణానికి గట్టి పునాది వేస్తోందని ఎమ్మెల్యే నానాజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎస్ మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కాకినాడ రూరల్ కో కో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు కూటమి నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, శిరంగి శ్రీనివాస్, మాదారపు తాతాజీ,ముద్రగడ్డ రమేష్, బండారు మురళి, దూడల నారాయుడు, పాండ్రంకి రాజు తదితరులు పాల్గొన్నారు.