పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో భవిష్యత్తులో నీటి లభ్యత క్షీణించకుండా ఉండాలంటే వర్షపు నీటిని నేలలోకి చొరబడేలా చేసే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. అలాగే రైతులు తమ పొలాల్లో వర్షపు నీరు నిల్వకు ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో సగటున ఐదు మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతానికి ఎక్కడా తీవ్రమైన నీటి కొరత లేదని తెలిపారు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె చెప్పారు. కొత్తగా బోర్లు వేయించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. గృహ అవసరాలు లేదా వ్యవసాయ అవసరాల కోసం బోర్లు వేయించే ముందు భూగర్భ జల శాఖ ద్వారా సాంకేతిక పద్ధతిలో భూగర్భ జలాల స్థితిని పరిశీలించి సరైన బోర్ పాయింట్ గుర్తించి అనుమతి ఇవ్వబడుతుందని తెలిపారు. ఇలా చేయడం వల్ల బోర్లో నీరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అనవసర ఖర్చులు మరియు సమస్యలు నివారించవచ్చని పేర్కొన్నారు. భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. భూగర్భ జలాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని భూగర్భ జల శాఖను నేరుగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.