గణతంత్ర వేడుకలో మెరిసిన తెలంగాణ యువ కళాకారుడు

"దొమ్మాట గ్రామానికి చెందిన కళాకారుడు దేవి రవి ఆనంద్"

(పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామానికి చెందిన యువ కళాకారుడు దేవి రవి (ఆనంద్) తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా ప్రముఖుల సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ ప్రదర్శన ఇవ్వడం గ్రామానికి, జిల్లాకు గర్వకారణమైంది. ఈ నేపథ్యంలో, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలల పాఠశాలలో ఈరోజు ఆనంద్‌కు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి అతనికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. చిన్న గ్రామం నుంచి వెలుగొందుతూ దేశస్థాయికి చేరుకున్న ఆనంద్‌ను చూసి విద్యార్థుల్లో ప్రేరణ కలిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అనిల్ కుమార్, గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంజీవ్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ కుమార్, మల్లేశం, రవీందర్, వినయ్ కుమార్, అబిక మేడం, మనోహర్, శివరాజ్, దశరథ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వారు ఆనంద్ సాధించిన విజయాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతిభకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా దేశస్థాయిలో గుర్తింపు పొందవచ్చని ఆనంద్ విజయగాథ మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *