డిపో మేనేజర్ నిర్లక్ష్యం.. పెట్రోల్ బంకులో సొమ్ము మాయం..

పయనించే సూర్యుడు-03-04-2026-రాజంపేట న్యూస్ : ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులో రెండవ దఫా డబ్బులు స్వాహా అయినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. బుధవారం ఆర్టీసీ డిపో విజిలెన్స్ సెక్యూరిటీ జోనల్ అధికారి ధర్మతేజ, కడప మరియు అన్నమయ్య జిల్లాల చీఫ్ సెక్యూరిటీ అధికారి రామకృష్ణ రాజంపేట ఆర్టీసీ డిపో ను సందర్శించి పెట్రోల్ బంకులో రికార్డులు పరిశీలించగా డిజిటల్ మరియు నగదు లావాదేవీలలో సుమారు రూ 35 వేలు తేడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అక్కడ పనిచేసే ముగ్గురు సిబ్బందిని నిలదీయగా తప్పు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. గతంలో ఇదే పెట్రోల్ బంకులో సిబ్బంది చేతివాటంతో సుమారు రూ 50 లక్షలకు పైగా గోల్మాల్ జరిగి., సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్న విషయం విధితమే. ఐతే, నూతన ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టి సుమారు మూడు నెలలు దాటినప్పటికీ డిపో మేనేజర్ గోవర్ధన్ రెడ్డి పెట్రోల్ బంకుపై దృష్టి సారించకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగానే రెండవ దఫా కూడా పెట్రోల్ బంక్ లో సొమ్ము మాయమైనట్లు కార్మికులు గుసగుసలాడుతున్నారు. కేవలం ఒక్క రూపాయి తప్పిదంపై కూడా డ్రైవర్లు, కండక్టర్లపై సస్పెన్షన్ చేసేటంత చర్యలు చేపట్టే డిపో మేనేజర్ కనీసం ఒక్క రోజైనా పెట్రోల్ బంక్ లో తనిఖీలు నిర్వహించి ఉంటే మరో మారు ఈ తప్పిదం జరిగేది కాదని ఆర్టీసీ కార్మికులు చర్చించుకుంటున్నారు. డిపో మేనేజర్ నిర్లక్ష్యమే సొమ్ము స్వాహాకు ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *