
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఘనంగా నిర్వహించిన గ్రామసభ ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థాన్ని చాటిచెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన ఈ సభకు గ్రామస్థులు విశేష స్పందన చూపారు. గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి అధ్యక్షతన, ఉప సర్పంచ్ తాటి సాయి సమక్షంలో జరిగిన ఈ గ్రామసభలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, విద్యుత్ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వీఓలు, రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు హాజరై గ్రామాభివృద్ధిపై సమగ్ర చర్చలు జరిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు సభలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గ్రామసభలో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, విద్యా ప్రమాణాలు, పాఠశాల మౌలిక వసతులు, రోడ్డు రవాణా, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, శిశు సంక్షేమం, యువత అభివృద్ధి, క్రీడా ప్రోత్సాహం, మహిళల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. అలాగే కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకాలు, ఉచిత విద్యుత్ యూనిట్లు, ఉపాధి హామీ పథకం, ఆసరా పింఛన్లు, సన్న బియ్యం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిగింది. ఆరోగ్యశాఖ ప్రతినిధులు బాలింతలు మరియు శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ శిశు మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎయిడ్స్ అవగాహనపై కూడా గ్రామ ప్రజలకు సూచనలు అందించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణతో చదవాలని ఉపాధ్యాయులు సూచనలు ఇచ్చారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన విధానం అత్యవసరమని అధికారులు వివరించారు.
గ్రామస్థులు తమ సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తూ ముఖ్యంగా తాగునీటి కొరత, సీసీ రోడ్ల నిర్మాణం, రహదారి సౌకర్యాలపై తమ అభ్యర్థనలు వినిపించారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొల్లం సత్తవ్వ, దోమల ప్రమీల, బండి శ్రీలత, కడారి పోచయ్య, ముత్యాల నరసవ్వ, బొల్లం రాజేష్, బొల్లం రాజేష్ కుమార్, కేంబా సారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీఎం మైపాల్, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, విద్యుత్ శాఖ నజీరుద్దీన్, ఏఎన్ఎం బొల్లం పుష్పలత, ఆశ వర్కర్ బొల్లం రేణుక, అంగన్వాడి టీచర్లు బాలమని. నాగరాణి. రజిని.గ్రామ పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సఫాయి కార్మికులు .మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న ఈ గ్రామసభ గ్రామ పాలనలో పారదర్శకతను, ప్రజాస్వామ్య విలువలను మరింత బలపరిచింది. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం ఒక కీలక అడుగుగా నిలిచింది.